: ఇంధన పొదుపు చర్యలపై ఏపీని అభినందించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న విద్యుత్ పొదుపు చర్యలను ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల సీఎస్ లతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, ఏపీ అమలు చేస్తున్న విద్యుత్ పొదుపు చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. ఈ మేరకు ఏపీ సర్కారును అభినందించారు. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తాము చేపడుతున్న ఇంధన పొదుపు చర్యలను ప్రధానికి వివరించారు. ప్రధానంగా, వీధి లైట్ల కోసం ఎల్ఈడీ బల్బులు వినియోగించడం ద్వారా విద్యుత్ పొదుపు చేయగలుగుతున్నామని సీఎస్ తెలిపారు. భవిష్యత్తులో గృహావసరాల కోసం కూడా ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని, తద్వారా మరింత విద్యుత్ పొదుపు సాధ్యమవుతుందని సీఎస్ ప్రధానికి వివరించారు.