: నిర్దోషికి భారీ పరిహారం...'అయినా జీవితం తిరిగి రాదుగా?' అంటున్న బాధితుడు!
చేయని నేరానికి 25 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి భారీ పరిహారం అందజేయనున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన జోనాథన్ ఫ్లెమింగ్ (53) ను 1989లో ఓ హత్యకు సంబంధం ఉందంటూ పోలీసులు అరెస్టు చేశారు. తనకు, ఆ హత్యకు సంబంధం లేదని జోనాథన్ ఎంత మొత్తుకున్నా న్యూయార్క్ పోలీసులు వినలేదు. దీంతో అతనికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూనే జోనాథన్ న్యాయపోరాటం ప్రారంభించాడు. సుదీర్ఘ పోరాటం అనంతరం జోనాథన్ నిర్దోషి అంటూ న్యాయస్థానం ఈ మధ్యే ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు విన్న జోనాథన్ ఉద్వేగంతో జైల్లో కూర్చుని పది నిమిషాలు రోదించాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం పాతికేళ్ల జీవితం నాశనమైపోయిందని, దానిని ఎవరు తెచ్చిస్తారని ప్రశ్నించాడు. అలాగే, ఇప్పుడేం చేసినా ఆ జీవితం తిరిగి రాదుగా? అంటూ నిర్వేదం ప్రదర్శించాడు. దీంతో, పోలీసులు, న్యాయస్థానాలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన అధికారులు జోనాథన్ ఫ్లెమింగ్ జీవితం తిరిగి తీసుకురాలేమని, జరిగిన నష్టానికి ప్రతిగా 6.25 మిలియన్ డాలర్లు పరిహారంగా అందజేస్తామని తెలిపారు.