: లఖ్వీ ఓ విషసర్పం... చైనాను కూడా కాటేయగలడు: బీజేపీ
ఐక్యరాజ్యసమితిలో చైనా వ్యవహరించిన తీరుపై బీజేపీ మండిపడింది. తీవ్రవాద నేత, ముంబయి పేలుళ్ల మాస్టర్ మైండ్ జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని విడుదల చేసిన పాకిస్థాన్ పై చర్యలు తీసుకోవాలన్న భారత్ కు ఐరాసలో చైనా అడ్డుతగిలింది. వీటో అధికారాన్ని ఉపయోగించి భారత్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ ఘాటుగా స్పందించారు. లఖ్వీ ఓ విషసర్పం వంటివాడని, భారత్, చైనాలను కసిగా కాటేయగలడని వ్యాఖ్యానించారు. భారత్ పరిస్థితిని చైనా అర్థం చేసుకుంటుందని భావించామని, కానీ, చైనా మరోలా వ్యవహరించిందని అన్నారు. భారత్ ను కాటేసేందుకు ప్రయత్నిస్తున్న విషసర్పం లఖ్వీ, చైనాను కూడా భయంకరంగా కాటేయగలడని అన్నారు. కాగా, ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ సీరియస్ గా పరిగణిస్తుందని, చైనా వర్గాలను వివరణ కోరుతుందని అక్బర్ తెలిపారు.