: ఒక్కో జవానుకు రూ. 2 లక్షలు... ప్రజలకు ఈశాన్య మిలిటెంట్ల ఆఫర్
భారత సైన్యంపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రాల్లోని మిలిటెంట్లు సరికొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారు. భారత సైన్యంలోని ఒక్క జవానును పట్టుకుని తమకు అప్పగిస్తే రూ. 2 లక్షల నజరానా ఇస్తామని చెబుతున్నారు. రెండు వారాల క్రితం భద్రతా దళాల కాన్వాయ్ పై మిలిటెంట్లు దాడి చేసి 18 మందిని చంపడం, ఆ వెంటనే సైన్యం భారత సరిహద్దులు దాటి మయన్మార్ లోకి ప్రవేశించి 20 మంది మిలిటెంట్లను మట్టుబెట్టడం మనకు తెలిసిందే. దీంతో వెనక్కు తగ్గిన ఎన్ఎస్ సీఎన్ (కే) మిలిటెంట్లు తమ క్యాంపులను సరిహద్దుల నుంచి తీసేశారు. కాగా, ఈశాన్య మిలిటెంట్లు ఏ క్షణమైనా ప్రతీకార దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. మణిపూర్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న సైన్యం అప్రమత్తంగా ఉండాలని ఐబీ ఇప్పటికే సూచించింది.