: ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై టీఎస్ విద్యార్థుల దాడి... గవర్నర్ సీరియస్
జేఎన్ టీయూలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితుడు గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, కూకట్ పల్లి ప్రగతినగర్ కు చెందిన రాజశేఖర్, కొండాపూర్ లోని 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ మేనేజ్ మెంట్'లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన జేఎన్టీయూలోని తన స్నేహితులను కలవడానికి వెళ్లిన సమయంలో, సెక్షన్-8 అమలు ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ, విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారు. చదువుకోకుండా ఇలాంటి గొడవలు చేస్తుంటే ఎలా చూస్తూ ఉన్నావంటూ అక్కడున్న వాచ్ మన్ కి రాజశేఖర్ క్లాస్ తీసుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థులు ఎదురుతిరిగి దాడి చేశారు. ఆంధ్రాకు చెందిన తనను మరోసారి క్యాంపస్ లో కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు రాజశేఖర్ తెలిపారు. తనపై తెలంగాణ జాగృతి జేఎన్ టీయూ క్యాంపస్ ఇన్ చార్జి మధుతో పాటు పలువురు విద్యార్థులు దాడి చేశారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.