: బుసలు కొట్టిన పేదరికం...ఆస్పత్రి బిల్లు చెల్లించలేక శిశువును అమ్ముకున్న పేద జంట!
దేశంలో ఆర్థిక సంస్కరణలు ఎన్ని వచ్చినా, ఫలితం లేకుండాపోతోంది. పేదరికం తగ్గిందని ప్రభుత్వాలు జబ్బలు చరుచుకోవడం మినహా, వాస్తవంగా పేదరికం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో నేటి ఉదయం వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ, అప్పుడే పుట్టిన తన బిడ్డను అమ్ముకోకతప్పలేదు. మహిళకు కాన్పు చేసిన ఆస్పత్రి సిబ్బంది ఆ పేద దంపతుల కళ్లు తిరిగే బిల్లును వారి చేతితో పెట్టింది. పేదరికంతో అష్టకష్టాలు పడుతున్న ఆ దంపతులు బిల్లు చెల్లించలేక, శిశువును ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు. శిశువును తీసుకున్న ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. అయితే, తర్వాత శిశువుపై మమకారం చావని ఆ పేద దంపతులు ఎలాగోలా డబ్బు సర్దుకుని తిరిగి ఆస్పత్రికి చేరుకున్నారు. బిల్లు కట్టేస్తాం, మా బిడ్డను మాకు ఇవ్వండన్న వారి అభ్యర్థనకు ఆస్పత్రి సిబ్బంది ససేమిరా అన్నారు. అయితే ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బయటకు పొక్కడంతో ఆస్పత్రి సిబ్బంది శిశువును కొనుగోలు చేసిన వ్యక్తితో మాట్లాడారు. శిశువును వెనక్కిచ్చేందుకు ఆ వ్యక్తి ఒప్పుకోవడంతో పేద దంపతుల మనసు కుదుటబడింది. మరికాసేపట్లో ఆ వ్యక్తి శిశువును పేద దంపతులకు అప్పగించనున్నారు.