: జగన్ కు నల్లపురెడ్డి ఝలక్ ఇవ్వనున్నారా?...వైసీపీకి రాజీనామా చేస్తారని పుకార్లు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలేలానే ఉంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న అధికార టీడీపీ... కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీతో బస్తీమే సవాల్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఇరు పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో నేడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం తీరుతో మనసు నొచ్చుకున్న నల్లపురెడ్డి, జగన్ కు ఝలక్ ఇవ్వడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే, నెల్లూరు ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ ఖాతాలో పడటం ఖాయమే. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో నల్లపురెడ్డి రాజీనామా బాట పట్టనున్నారని తెలుస్తోంది. నేడు పార్టీ అధినాయకత్వానికి ఆయన రాజీనామా లేఖ పంపనున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి.