: ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని జింబాబ్వే ఆటగాళ్లను 'రా' బెదిరించింది: పాక్ నేత
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ హోం మంత్రి షూజా ఖాన్ జాదా భారత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జింబాబ్వే జట్టును పాకిస్థాన్ లో పర్యటించకుండా అడ్డుకునేందుకు భారత్ కు చెందిన నిఘా సంస్థ 'రా' అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. లాహోర్ లోని పంజాబ్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ టూర్ కి బయల్దేరిన జింబాబ్వే జట్టు దుబాయ్ లో అడుగుపెట్టిన సమయంలో, ఆ జట్టు మేనేజర్ కు 'రా' ఓ సందేశం పంపిందని, ఆటగాళ్లు లాహోర్ వెళితే వారిలో ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో వెళ్లలేరని హెచ్చరించినట్టు వివరించారు. జింబాబ్వే జట్టు మేనేజర్ ఆ టెక్స్ట్ ను తమకు ఫార్వార్డ్ చేయడంతో విషయం తెలిసిందని ఖాన్ జాదా తెలిపారు. భద్రత అధికారులు ఆ సందేశాన్ని పరిశీలించగా, 'రా' అధికారి నుంచి వచ్చినట్టు తెలిసిందని వెల్లడించారు. పాకిస్థాన్ లో జింబాబ్వే టూర్ ను భగ్నం చేసేందుకు 'రా' వేసిన అన్ని ఎత్తుగడలను తిప్పికొట్టామని అన్నారు.