: కవిత కేంద్ర మంత్రి అయితేనే సంపూర్ణ తెలంగాణ వచ్చినట్టా?: రాజనర్సింహ
నిజామాబాద్ ఎంపీ, తన కుమార్తె కవిత కేంద్ర మంత్రి అయితేనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ తెలంగాణ వచ్చినట్టా? అని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. తెలంగాణకు ఇంకా పూర్తి స్వాతంత్ర్యం రాలేదని, రాష్ట్ర సాధన పరిపూర్ణం కాలేదని పలువురు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన, మెదక్ లో మాట్లాడుతూ, తెలంగాణ రాకపోతే టీఆర్ఎస్ నేతలు ఎక్కడ అధికారం వెలగబెడుతున్నారని ప్రశ్నించారు. పార్టీ సమస్యల్ని టీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలుగా చిత్రీకరించి, లేనిపోని సమస్యలు తెస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెడితే అనవసర విషయాలు పట్టించుకోవాల్సిన సమయం ఉండదని ఆయన పేర్కొన్నారు.