: 650 డాలర్ల ఐఫోన్... అక్కడ మాత్రం 47 వేల డాలర్లు!
వెనిజులా... ప్రపంచానికి ఎంతో మంది అందగత్తెలను అందించిన దేశం. కానీ నేడు ఆకాశానికి పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ధరలు రోజురోజుకూ రాకెట్లా దూసుకుపోతున్నాయి. ఉదాహరణకు మిగతా దేశాల్లో 650 డాలర్లకు (సుమారు రూ. 41 వేలు) లభించే ఐఫోన్-6 ధర వెనిజులాలో 47 వేల డాలర్లు (సుమారు రూ. 30 లక్షలు) పలుకుతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడనంత స్థాయికి పెరగడం ఒకటైతే, స్మార్ట్ ఫోన్ల షార్టేజీ మరో కారణం. వెనిజులా అధికారిక కరెన్సీ పేరు బొలివర్. అధికారిక ఎక్స్ఛేంజ్ రేట్ల ప్రకారం ఔషధాలు వంటి నిత్యావసర వస్తువుల కోసం ఒక డాలరుకు 6.3 బొలివర్లు, మిగతా అవసరాలకు 12 బొలివర్లు వస్తాయి. ఇది కేవలం అధికారికమే. అయితే, ప్రజలు మాత్రం బ్లాక్ మార్కెట్లో డాలర్లు కొనాల్సిందే. నల్ల బజారులో ఒక్కో డాలర్ కావాలంటే, 456 బొలివర్లు పెట్టాల్సిందే. ఇక్కడ ఓ మధ్యరకం స్మార్ట్ ఫోన్ 17 వేల బొలివర్లకు లభిస్తుంది. ఇది అక్కడి ప్రజల కనీస వేతనంతో పోలిస్తే 2.3 రెట్లు అధికం. ఐఫోన్-6 ఖరీదు 3 లక్షల బొలివర్లు. కనీస ఎక్స్ఛేంజ్ రేటు ప్రకారం దీన్ని అమెరికన్ కరెన్సీలోకి మారిస్తే 47,619 డాలర్లు అవుతుంది. అన్నట్టు ఇక్కడ స్మార్ట్ ఫోన్ ను ఒక్కసారి వీధిలో వాడితే చాలు... కాసేపట్లోనే దాన్ని దొంగతనం చేసేస్తారట. అందుకోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని దొంగలున్నారని అక్కడి పౌరులు వాపోతున్నారు.