: సెక్షన్ 8పై విస్తృత చర్చ... ఆందోళనపై కార్యాచరణ ప్రకటించిన టీఎన్జీవోలు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై రెండు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో చర్చకు తెరలేచింది. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు ఇక తప్పనిసరి అన్న వాదన కూడా వినిపిస్తోంది. సెక్షన్ 8 అమలుకు కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపిందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను తెలంగాణ వాదులు నిజమైనవేనని నమ్మినట్లుగానే ఉంది. సెక్షన్ 8 అమలుకు నిరసనగా చేపట్టనున్న ఆందోళనలపై టీఎన్జీవోలు కార్యాచరణ ప్రకటించడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఒకరి వెంట మరొకరు మీడియా ముందుకు వస్తున్న టీఎన్జీఓలు, మాజీ టీఎన్జీవోలు, జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు సెక్షన్ 8 పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా చేపట్టిన లంచ్ అవర్ డిమాన్ స్ట్రేషన్లు, నల్లబ్యాడ్జీలతో నిరసనలు మరోమారు తెరపైకి వచ్చాయి. కొద్దిసేపటి క్రితం అత్యవసరంగా భేటీ అయిన టీఎన్జీఓ నేతలు వేగంగా జరుగుతున్న పరిణామాలపై చర్చలు జరిపారు. రేపటి నుంచే ఆందోళనలకు తెర తీయనున్నట్లు భేటీ అనంతరం టీఎన్జీవోల అధ్యక్షుడు రవీందర్ ప్రకటించారు.