: సెక్షన్ 8పై పోరుకు టీఆర్ఎస్ సన్నాహాలు...దీక్షకూ వెనుకాడేది లేదంటున్న కేసీఆర్!
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాల నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై విస్తృత చర్చ జరుగుతోంది. సెక్షన్ 8 అమలు కోసం ఏపీ సర్కారు పట్టుబడుతుండగా, అమలు చేస్తే సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 8 అమలుకు కేంద్రం సానుకూలంగా ఉందన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ సర్కారు అప్రమత్తమైంది. ఒకవేళ సెక్షన్ 8 ను అమలు చేస్తే ప్రతిఘటించి తీరతామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. అంతటితో ఆగని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సెక్షన్ 8కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నారట. ఇప్పటికే పలు జాతీయ పార్టీలకు చెందిన నేతలతో ఆయన మంతనాలు కూడా జరిపారట. అవసరమైతే సెక్షన్ 8కు వ్యతిరేకంగా దీక్షకు దిగేందుకూ సిద్ధంగానే ఉన్నట్లు ఆయన తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. సదరు దీక్షను హైదరాబాదులో చేపట్టాలా? లేక ఢిల్లీలో చేపట్టాలా? అన్న విషయంపై ఆయన పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారట.