: బెజవాడ ‘నలంద’లో ఉద్రిక్తత... పాఠశాల సిబ్బంది, ఏబీవీపీ మధ్య ఘర్షణ
కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపిచ్చిన బంద్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా విజయవంతమైంది. బంద్ పిలుపు నేపథ్యంలో పలు విద్యా సంస్థలు స్వచ్చందంగా పాఠశాలలను మూసివేశాయి. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో విజయవాడలోని మొఘల్రాజపురంలోని నలంద స్కూల్ వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నలందలో తరగతులు కొనసాగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన ఏబీవీపీ విద్యార్థులను పాఠశాల సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.