: బ్రిటన్ ప్రధాని 'బీబీసీని మూసేయిస్తా'నన్నారట!
ప్రపంచ ప్రసిద్ధి చెందిన బీబీసీ న్యూస్ ను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మూసేయిస్తానని బెదిరించారని బీబీసీ ఎడిటర్ తెలిపారు. బీబీసీ ప్రసారం చేసిన కథనంలో గత ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓ సన్నివేశాన్ని పొలిటికల్ ఎడిటర్ నిక్ రాబిన్సన్ గుర్తుచేసుకున్నారు. బ్రిటన్ ఎన్నికల సందర్భంగా, కామెరాన్ ను నిక్ రాబిన్సన్ ఓ బస్సులో ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా కన్జర్వేటివ్ పార్టీ చేస్తున్న వాగ్దానాలు నెరవేర్చడం అసాధ్యం కదా? అని ప్రశ్నించారు. అంతకు ముందు బీబీసీ కన్జర్వేటివ్ పార్టీ చేసిన వాగ్దానాలు ఆచరణ సాధ్యం కాదు అంటూ పలు కథనాలు ప్రసారం చేసింది. దీంతో రాబిన్సన్ అడిగిన ప్రశ్నకు మండిపడ్డ కామెరాన్ బీబీసీని మూసేయిస్తానని అన్నారట. తొలుత సరదాగా జోక్ చేస్తున్నారని అనుకున్న రాబిన్సన్, ఆ తరువాత ఆయన సీరియస్ గానే అలా వ్యాఖ్యానించారని అర్థం చేసుకున్నారట. ఆయన ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ బస్సులో రాబిన్సన్ తో పాటు కొద్దిమందే ఉన్నారట. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించి, డేవిడ్ కామెరాన్ ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.