: రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ లోనే ఉంటా!: రఘువీరా
రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో తాము తప్ప మరెవరూ ఉండరన్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసునని జేసీ సోదరులపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. హంతకులు, నేరస్తులను, ఫ్యాక్షనిస్టులను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్న చంద్రబాబు దగ్గర చేరిందెవరు? అని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్నామని చెప్పి చంద్రబాబు కాళ్లో, జగన్ కాళ్లో పట్టుకోలేమని రఘువీరా పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిపోయిన తరువాత రఘువీరా కాంగ్రెస్ ను వీడనున్నారంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనపై రఘువీరా పైవిధంగా స్పందించారు. ఏపీ రాజధాని నిర్మాణంలో రహస్య ఎజెండా ఉందని, దేశ భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదమున్నా బాబు పట్టించుకోవట్లేదని పీసీసీ చీఫ్ ఆరోపించారు. మన రైతుల భూములను ఇతర దేశాలవాళ్లకివ్వడం చాలా తప్పు అని ఆయన అన్నారు.