: కేసీఆర్ ఓ ఊసరవెల్లి... గతంలో సెటిలర్లను దూషించి, ఇప్పుడు వారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు: షబ్బీర్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. కేసీఆర్ ఓ ఊసరవెల్లి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సెటిలర్లను దుర్భాషలాడిన కేసీఆర్... ఇప్పుడు వారిని మెప్పించేందుకు ఎన్నో ప్రకటనలు గుప్పిస్తున్నారని అన్నారు. అయ్యప్ప సొసైటీ, ఎన్ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణంలో ఎన్నో అవకతవకలున్నాయంటూ అసెంబ్లీ హౌస్ కమిటీని వేసిన కేసీఆర్... ఇప్పుడు వాటిని రెగ్యులరైజ్ చేస్తామంటున్నారని... ఇది అతని రంగులు మార్చే తత్వానికి నిదర్శనమని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ రంగులు మారుస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛ హైదరాబాద్ కేవలం పబ్లిసిటీ కోసమేనని, కేసీఆర్ ఇంటి వద్ద మాత్రమే పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ప్రభుత్వ ఏజెంటులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.