: రెండూ భారీ విజయాలే... ఉబ్బితబ్బిబ్బవుతున్న బంగ్లా కెప్టెన్


భారత్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ లాంటి బలమైన జట్టుపై సిరీస్ ను గెలుచుకోవడంతో... బంగ్లా కెప్టెన్ మోర్తజా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. జట్టు సభ్యులతో కలసి పండుగ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మోర్తజా మాట్లాడుతూ, భారత్ తో వరుసగా రెండు మ్యాచ్ లు గెలుస్తామని అస్సలు ఊహించలేదని అన్నాడు. తొలి వన్డేలో 79 పరుగుల తేడాతో విజయం, రెండో మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం... ఇదీ మోర్తజా ఆనందానికి కారణం. తాము సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని బంగ్లా కెప్టెన్ అన్నాడు. సిరీస్ కు ముందు నుంచి కూడా తమ ఆటగాళ్లంతా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నారని... అయితే, ఇంత గొప్ప విజయాలను మాత్రం ఊహించలేకపోయామని చెప్పాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడితేనే ఇలాంటి విజయాలు సాధించగలమని, దీనికి తోడు కొంచెం అదృష్టం కూడా కలసిరావాలని అన్నాడు. వాస్తవానికి నిలకడలేమి తమను నీరుగారుస్తోందని... ఈ విజయాల స్ఫూర్తితో, భవిష్యత్తులో కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News