: సినిమా పెద్దలతో సమావేశం నిర్వహిస్తా: కేసీఆర్


జయసుధ తనయుడు శ్రేయాన్ నటించిన బస్తీ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడారు. జయసుధ పట్ల అభిమానం, దర్శకుడు వాసుపై వాత్సల్యంతో ఈ ఫంక్షన్ కు వచ్చానని తెలిపారు. జయసుధ తనయుడు 'తెలుగు అమితాబ్ బచ్చన్'లా ఉన్నాడని కితాబిచ్చారు. శ్రేయాన్ కు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక, సినిమా ఇండస్ట్రీ గురించి చెబుతూ... ఓ అవార్డు ఫంక్షన్ లో అమితాబ్ బచ్చన్ కలిశారని, ఆ సందర్భంగా ఆయన అత్యధికంగా సినిమాలు తయారవుతున్న నగరం హైదరాబాదేనని అన్నారని వివరించారు. ముంబయిలోనూ ఈ స్థాయిలో సినిమాలు రావడంలేదని అమితాబ్ తెలిపారని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మోహన్ బాబు, చిరంజీవి, దాసరి నారాయణరావు, విజయనిర్మల వంటి ప్రముఖులతో ఇదివరకే మాట్లాడానని, అందరితో మాట్లాడి త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. అందరం కలిసి తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళదామని అన్నారు. కళాకారులను చిన్నపిల్లలు కూడా గుర్తు పడతారని, సినిమా రంగానికి తెలంగాణ సర్కారు అన్ని విధాలా తోడ్పడుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన 'బస్తీ' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

  • Loading...

More Telugu News