: యోగాను మతానికి ముడిపెట్టేవారు అది మతం కాదని ఇప్పుడు తెలుసుకున్నారు: చంద్రబాబు
గతంలో యోగాను మతానికి ముడిపెట్టి చూసేవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో యోగా దినోత్సవం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా అంటే మతం కాదని ప్రపంచం తెలుసుకుందని అన్నారు. తనను తాను మంచిగా మలచుకోవడానికి ప్రతి మనిషికి యోగా, ఆధ్యాత్మికత ఎంతో దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. ఈ రోజు యోగా చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా తృప్తిపొందారని, అది ప్రతి రోజూ పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఒక వ్యక్తి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మోదీ నిరూపించారని బాబు తెలిపారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తాజాగా ముఖ్యమంత్రి అయిన తరువాత మంత్రివర్గ సహచరులకు ఈషా ఫౌండేషన్ ద్వారా యోగా, ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యోగా ఆచరించేందుకు వయసు, కుల, మత, లింగ, ఆర్థిక బేధాలు లేవని, అందరూ ఆచరించాలని ఆయన సూచించారు. అందరూ ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టించడం కష్టం కాదని ఆయన చెప్పారు. చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ తో ఆడుకుంటున్నారని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండడంతో ఒత్తిడి పెరుగుతోందని, యోగా చేయడం ద్వారా దానిని నివారించుకోవచ్చని ఆయన తెలిపారు.