: శేషాచలంలో ఫైరింగ్... ‘ఎర్ర’ కూలీలు, పోలీసుల మధ్య కాల్పులు
తిరుమల వెంకన్న పాదాల చెంత శేషాచలం అడవుల్లో మరోమారు కాల్పుల కలకలం రేగింది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని ముంగిళిపట్టు సమీపంలో ఎర్రచందనం కూలీలు, పోలీసుల మధ్య కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టే క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ‘ఎర్ర’ కూలీలు కాల్పులకు తెగబడగా, పోలీసులు సైతం వారిపైకి ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసుల ఎదురు కాల్పులతో భీతిల్లిన ‘ఎర్ర’ కూలీలు ప్రాణాలు దక్కించుకునే క్రమంలో పరుగులు పెట్టారు. వారిని వెంటాడిన పోలీసులు ఎనిమిది మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు.