: దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు మొదలుపెట్టండి... అధికారులకు చంద్రబాబు ఆదేశం
విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ పనులకు మోక్షం కలిగింది. వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆదేశించారు. ఈ మేరకు అక్కడి సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఫ్లై ఓవర్ పనులపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నెలాఖరులోగా పనుల విషయంపై ఓ స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అది పూర్తయ్యేలోగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులు కూడా మొదలుపెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. గుడి మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమస్యకు పరిష్కారం చూపాలని చాలాసార్లు రాజకీయ నేతలు, పలువురు పెద్దలు కోరుతూ వచ్చారు. దాంతో ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్టు ప్లాన్-3ని ఆమోదింపజేశారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ పనులు తక్షణమే మొదలవుతాయని నగర ప్రజలు భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కూడా సిద్ధం చేశారు.