: హెల్మెట్లు వాడద్దని పోలీసుల సమక్షంలోనే సలహా ఇచ్చిన రాజస్థాన్ ఎమ్మెల్యే!


హెల్మెట్ల వాడకంపై ఎమ్మెల్యే, ఏఎస్పీ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడంతో ఏది అనుసరించాలో తెలియక ప్రజలు తలపట్టుకున్న ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. భద్రత వారోత్సవాల్లో భాగంగా రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరూ శిరస్త్రాణం (హెల్మెట్) ధరించవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. శిరస్త్రాణం కారణంగా దొంగలు తప్పించుకుపోతున్నారని ఆయన పేర్కొన్నారు. 'ఇష్టం ఉంటే హెల్మెట్ ధరించండి, లేదంటే మానేయండ'ని ఆయన పిలుపునిచ్చారు. అలాగే హెల్మెట్ ధరించడం లేదని ప్రజలను పోలీసులు వేధించడం మానుకోవాలని ఆయన వారికి హితవు పలికారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అలాగే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్మెట్ ధరిస్తే ఉడికిపోతున్నారని ఆయన తెలిపారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ ఏఎస్పీ మాట్లాడుతూ, ప్రజా భద్రత కోసమే హెల్మెట్లు పెట్టుకోవాలని అన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేటప్పుడు ప్రమాదం జరిగితే మరణించే అవకాశం ఉందని, హెల్మెట్ ఉంటే రక్షణ లభిస్తుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News