: దేశాన్ని పాలిస్తోంది మోదీ కాదు: వీహెచ్
దేశాన్ని పరిపాలిస్తోంది ప్రధాని మోదీ కాదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తెలిపారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ ఏం చెబితే అదే జరుగుతోందని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ చేసిన వ్యాఖ్యల్లానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లోనే నల్లధనాన్ని దేశానికి రప్పిస్తానని చెప్పిన మోదీ, ఏడాది గడిచినా నల్లధనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. పైగా దేశాన్ని లూటీ చేసి హవాలా ద్వారా విదేశాల్లో డబ్బుదాచిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని రక్షించడం సిగ్గుచేటని వీహెచ్ మండిపడ్డారు. లలిత్ మోదీ వీసా సిఫారసులో ప్రధాని ప్రమేయం లేని పక్షంలో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేలను తక్షణం బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు ఆరోపణల్లో చిక్కుకున్న ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూ, గవర్నర్ ను దూషిస్తున్నారని, ఆయన పచ్చి అవకాశవాది అని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.