: ఇక సులభంగా సంపాదించడం కష్టమే... సంపద సృష్టికి 5 ఐడియాలు!


స్టాక్ మార్కెట్లలో సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇప్పట్లో అవకాశాలు లభించవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాస్తంత తెలివిగా ఆలోచించి పెట్టుబడి పెడితే, సంపద సృష్టి సులువేనని సలహాలు ఇస్తున్నారు. ఆల్ టైం రికార్డు స్థాయి 30,024 పాయింట్లతో పోలిస్తే 10 శాతం తక్కువగా ఉన్న సెన్సెక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని కంపెనీలూ ఒకే విధమైన పనితీరును కనబరచలేవని, స్టాక్స్ ఎంపికలో జాగ్రత్త పాటించి కొన్నింటిని ఎంచుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు గడించవచ్చని సూచిస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్, జియోజిత్ బీఎన్ పీ పారిబాస్, అల్టామౌంట్ కాపిటల్ వంటి సంస్థలు రీసెర్చ్ చేసి ఆరు నుంచి 12 నెలల కాలానికి మంచి రాబడి అందించగలవని కొన్ని స్టాక్స్ సూచించారు. వీటిల్లో ఐడీఎఫ్సీ ముందు నిలిచింది. మౌలిక వసతుల కల్పనలో నిమగ్నమైన సంస్థలకు రుణ సహాయం అందిస్తున్న ఈ సంస్థ భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతుందని సలహా ఇస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం రూ. 1719 రూపాయల వద్ద ఉన్న ఎల్అండ్ టీ ఈక్విటీ ధర సమీప భవిష్యత్తులో రూ. 2000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ నిర్వహిస్తున్న కొన్ని ప్రాజెక్టులకు నియంత్రణా సంస్థల అనుమతులు ఆలస్యం కావడంతో పనులు నిదానంగా సాగుతున్నాయని, ఒకసారి అనుమతులు లభిస్తే ఎల్అండ్ టీ ముందుకు దూకుతుందని చెబుతున్నారు. భారత స్టాక్ మార్కెట్లో ఆకర్షణీయంగా ఉన్న మరో కంపెనీ టెక్ మహీంద్రా. ప్రస్తుతం రూ. 544 వద్ద ఉన్న ఈక్విటీ 6 నుంచి 12 నెలల్లో రూ. 700 దాటుతుందని జియోజిత్ బీఎన్ పీ పారిబాస్ భావిస్తోంది. త్రైమాసిక ఫలితాల వెల్లడి తరువాత దిగజారుతున్న సంస్థ ఈక్విటీ పుంజుకోవడం ప్రారంభమై, టెలికం వ్యాపారం నుంచి ఆదాయం రావడం మొదలైతే, స్థిరమైన వృద్ధితో సాగుతుందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు బాలకృష్ణా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలూ ఆకర్షణీయంగానే ఉన్నాయి. (ఈ సెక్షన్ లో వెల్లడైన అభిప్రాయాలు అనలిస్టుల వ్యక్తిగతం. ఏవైనా స్టాక్స్ కొనుగోలు చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వయిజర్ల సలహాలు తీసుకొని ముందడుగు వేయాలి)

  • Loading...

More Telugu News