: సెల్ ఫోన్ మార్కెట్లోకి తిరిగి రానున్న నోకియా
ఐదారేళ్ల క్రితం వరకూ ప్రపంచ మొబైల్ మార్కెట్లో అగ్రస్థానాన్ని అనుభవించిన నోకియా, ఆపై శాంసంగ్, యాపిల్ వంటి మల్టీ నేషనల్, మైక్రోమ్యాక్స్, సెల్ కాన్ వంటి దేశవాళీ సంస్థలతో పోటీ పడలేక మొబైల్ బిజినెస్ ను మైక్రోసాఫ్ట్ కు విక్రయించి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో మైక్రోసాఫ్ట్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2015 వరకూ నోకియా సెల్ ఫోన్లను తయారు చేయకూడదు, విక్రయించకూడదు. ఆ గడువు మరో ఆరు నెలల్లో తీరిపోనుండడంతో 2016లో తిరిగి సెల్ ఫోన్ మార్కెట్లోకి రావాలని నోకియా భావిస్తోంది. ఇందుకోసం తమకు తగ్గ భాగస్వాములను వెతుకుతున్నామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ సూరి వివరించారు. తాము సెల్ ఫోన్లను డిజైన్ చేసి వాటిని ఇతర కంపెనీల బ్రాండ్లుగా వాడుకునేందుకు లైసెన్సులు ఇస్తామని అన్నారు.