: సెక్షన్ 8 చెల్లదనడానికి కేసీఆర్ ఎవరు?: సోమిరెడ్డి సూటి ప్రశ్న
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 చెల్లదని చెప్పడానికి కేసీఆర్ ఎవరని టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. సెక్షన్ 8 చెల్లదని చెబితే, ఆ సెక్షన్ ఉన్న విభజన చట్టం కూడా చెల్లదని ఆయన అన్నారు. విభజన చట్టంలోని మిగిలిన సెక్షన్లన్నీ వర్తించినప్పుడు సెక్షన్ 8 ఒక్కటే ఎందుకు చెల్లదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి తెలంగాణ సర్కారు వైఖరిపై విరుచుకుపడ్డారు. చట్టాలు ఎక్కడైనా ఓకేలా ఉంటాయని ఆయన అన్నారు. టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ పలుమార్లు గవర్నర్ తో భేటీ కావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. చట్టాల చెల్లుబాటుపై ఒక్క కేసీఆరే కాక తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సహా ఏ ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు లేదని సోమిరెడ్డి వివరించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో నివసించే ప్రజలందరి రక్షణ బాధ్యత గవర్నర్ దేనని ఆయన పునరుద్ఘాటించారు.