: ఆల్సేషియన్ కుక్కను కసిదీరా కరిచిన బామ్మ!


'కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తేనే వార్త...' ఎటువంటి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై జర్నలిజంలో చెప్పే ప్రాథమిక సూత్రం ఇది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి వార్తే బ్రిటన్ లో చోటుచేసుకుంది. డెవోన్ ప్రాంతంలోని ఇపిల్ పెన్ లో ఓ బామ్మ ఆల్సేషియన్ కుక్కను కసిదీరా కరిచింది. అందుకు బలమైన కారణమే ఉంది. వివరాల్లోకి వెళితే... జూన్ హట్టన్ (80) అనే వృద్ధురాలు తన పెంపుడు శునకం మిల్లీని తీసుకుని వ్యాహ్యాళికి బయల్దేరింది. ఇంతలో ఓ భారీ ఆల్సేషియన్ శునకం హట్టన్ పెంపుడు కుక్కపై దాడి చేసింది. ఆ యార్క్ షైర్ టెర్రియర్ మెడను చిక్కించుకుని తన పదునైన పళ్లతో గాయపర్చింది. దీంతో, ఏం చేయాలో తోచని హట్టన్ వెంటనే ఆ ఆల్సేషియన్ పై లంఘించి దానిని కసిదీరా కొరికింది. అయినా, ఫలితం లేకపోయింది. పాపం! ఆ బుజ్జి కుక్కపిల్ల ప్రాణాలు విడిచింది. ఇంతలో ఆ ఆల్సేషియన్ యజమాని వచ్చి తన పెంపుడు శునకాన్ని పట్టుకున్నాడు. అనంతరం హట్టన్ కు క్షమాపణ తెలిపాడు. దీనిపై హట్టన్ మాట్లాడుతూ... మిల్లీపై ఆల్సేషియన్ దాడి చేయడంతో ఏం చేయాలో తోచలేదని, దాంతో, కరిచేశానని తెలిపింది. అయితే, ఆ పెద్ద కుక్క పట్టు విడవలేదని, తన నోట్లోకి మాత్రం కుక్క బొచ్చు వచ్చిందని వివరించింది. అప్పుడు కత్తి ఉంటే బాగుండేదని, దాన్ని పొడిచి పొడిచి చంపేదాన్నని ఆవేశం ప్రదర్శించింది.

  • Loading...

More Telugu News