: ఫ్యాన్స్ ను విస్మయానికి గురిచేసిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్
'టెర్మినేటర్' సిరీస్ చిత్రాలతో బాగా పాప్యులరైన నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ కండలరాయుడు మంచి హాస్యప్రియుడు కూడా. ఎప్పుడూ సరదాగా ఉండడం ఆయన నైజం. తాజాగా, తనలోని కామిక్ సెన్స్ ను సమాజహితానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హాలీవుడ్ లోని మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో ఓ మైనపు విగ్రహం మాదిరిగా పోజిచ్చాడు. టెర్మినేటర్ సిరీస్ లో తాను ధరించిన దుస్తుల్లో అచ్చు మైనపు విగ్రహంలా కనిపించాడు. అది చూసి చాలామంది నిజంగా విగ్రహమే అనుకున్నారట. అభిమానులు ఫొటోలు తీసుకుందామని దగ్గరికి రాగా, ఒక్కసారిగా కదిలి వారిని షాక్ కు గురిచేశాడు. ఓ మహిళ అయితే భయంతో దూరంగా వెళ్లిపోయి, ఇతను నిజంగా ష్వార్జ్ నెగ్గరే అని పేర్కొంది. ఇక, ఓ బాలుడు దగ్గరికి రాగా, 'తాకొద్దు' అనే సరికి ఆ చిన్నారి హడలిపోయాడు. వెర్రికేక పెట్టి పరుగుందుకున్నాడట ఆ బాలుడు. విగ్రహమే కదా అని సమీపానికి వచ్చిన మరో చిన్నారిని షేక్ హ్యాండ్ అడిగేసరికి ఆ చిన్నారి ఏడుపందుకున్నాడు. అంతేగాదు, ష్వార్జ్ నెగ్గర్ టెర్మినేటర్ దుస్తుల్లోనే హాలీవుడ్ వీధుల్లో తిరిగాడు. సినిమాలో మాదిరే ఓ ట్రక్కును ఆపి డ్రైవర్ ను దిగి వెళ్లిపోవాలని అడిగాడు. అయితే, ఇదంతా ష్వార్జ్ నెగ్గర్ సరదా కోసం చేయలేదు. ఒమేజ్.కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ఛారిటీ కార్యక్రమంలో భాగంగానే ఇలా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.