: మాజీ ఎంపీ హర్షకుమార్ కు జైలుశిక్ష
డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు ఆరు నెలల జైలుశిక్ష పడింది. దీంతో పాటు రూ. 1000 జరిమానా కూడా కట్టాలని రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. కిశోర్ బాబు తీర్పిచ్చారు. ఈ కేసు 2007 ఫిబ్రవరి 25 నాటిది. అప్పట్లో మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో 144 సెక్షన్ విధించారు. ఆనాటి రాత్రి కొందరు వ్యక్తులు గుమిగూడి ఉండడంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఎంపీగా ఉన్న హర్షకుమార్ పోలీస్ స్టేషనుకు వెళ్లి విధుల్లో ఉన్న ఏఎస్సై సత్యనారాయణపై దౌర్జన్యం చేసి పోలీసుల అదుపులో ఉన్నవారిని బలవంతంగా విడిపించుకుపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, సుమారు ఎనిమిదేళ్ల విచారణ అనంతరం, హర్షకుమార్ పై నేరాభియోగాలు రుజువు కావడంతో మేజిస్ట్రేట్ ఈ శిక్షను విధించారు. ఈ కేసులో పైకోర్టుకు వెళ్లేందుకు హర్షకుమార్ కు 30 రోజుల సమయం ఇచ్చారు.