: ట్యాపింగ్ బయటకు పొక్కడంతోనే...టీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను సెలవులో పంపారు: వర్ల రామయ్య
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా ఏపీ ప్రభుత్వంలోని దాదాపు 120 మంది కీలక నేతలు, అధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ట్యాపింగ్ చేసిందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. గుట్టుగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు పొక్కడంతోనే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కేసీఆర్ సర్కారు సెలవులో పంపిందని ఆయన తెలిపారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు పొక్కడంతో తెలంగాణ సీఎం అసహనంగా ఉంటున్నారు. ఈ సమాచారం బయటకు పొక్కడానికి కారణంగా భావించి శివధర్ రెడ్డిని అమర్యాదకరంగా పంపించివేశారు. లేకపోతే, ఇక్కడ ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ సెలవులో ఎలా వెళతారు?’’ అని ఆయన ప్రశ్నించారు.