: మోదీ ఫోన్ కాల్ ఉద్రిక్తతలను చల్లార్చిందంటున్న పాక్ మీడియా


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఫోన్ కాల్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చిందని పాక్ మీడియా అంటోంది. 'మోదీ చొరవ' పేరిట 'డైలీ టైమ్స్' పత్రిక ఈ మేరకు సంపాదకీయం రాసింది. కొంతకాలంగా భారత్, పాక్ ల మధ్య నెలకొన్న వాడీవేడి వాతావరణంలో మోదీ కాల్ కారణంగా మార్పు వచ్చిందని తెలిపింది. "ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధాని నుంచి ఇదో సానుకూల స్పందన. వివాదాస్పద ప్రకటనలు చేయడాన్ని కట్టిపెట్టాలని ఆ ఐదు నిమిషాల ఫోన్ కాల్ సందర్భంగా ఇద్దరు నేతలు అంగీకరించారు" అని పేర్కొంది. కొన్నిరోజుల క్రితం భారత దళాలు మయన్మార్ భూభాగంలోకి ప్రవేశించి తీవ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. అనంతరం, పాక్ వంటి దేశాలకు ఇదో హెచ్చరిక అని కేంద్రం వ్యాఖ్యానించింది. దీంతో, పాకిస్థాన్ భగ్గుమంది. మయన్మార్ లో ప్రవేశించి దాడులు చేసినట్టుగా పాక్ గడ్డపై అడుగుపెట్టాలని ప్రయత్నిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News