: ఆన్ లైన్ షాపింగ్ తో లాభాల కన్నా నష్టాలే ఎక్కువ!
ఔర్ దిఖావో... ఔర్ దిఖావో (మరిన్ని చూపించు... మరిన్ని చూపించు)... ఇది ఈ-కామర్స్ సేవల సంస్థ అమేజాన్ సరికొత్త ప్రచారం. మరిన్ని చాయిస్ లను చూపిస్తేనే భారత కస్టమర్ తృప్తి చెందుతాడన్న విషయాన్ని అమేజాన్ చాలా తక్కువ సమయంలోనే గమనించింది. ఒక్క అమేజాన్ మాత్రమే కాదు, పలు కంపెనీలూ వందలాది ప్రొడక్టుల నుంచి వేలు, లక్షల ప్రొడక్టులను ఆఫర్ చేసే దిశగా సాగిపోయాయి. గత కొద్ది సంవత్సరాలుగా వేగవంతమైన వృద్ధి భారత ఈ-కామర్స్ రంగంలో కనిపిస్తోంది. సెల్లర్స్ మార్కెట్ నుంచి బయ్యర్స్ మార్కెట్ గా రూపాంతరమూ చెందింది. కోట్ల రూపాయల పెట్టుబడులు వెంచర్ ఫండ్స్, పారిశ్రామికవేత్తల నుంచి ఈ రంగంలోకి వచ్చాయి. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఆన్ లైన్ వ్యాపారంలో లాభాల కన్నా నష్టాలే అధికమని అంటున్నారు నిపుణులు. వాటిని పరిశీలిస్తే... లాభాలు... సమయం ఆదా, షాపింగ్ ఈజీ: ఓ జత షూస్ లేదా బ్లేజర్ లేకుంటే మరో మొబైల్ కొనుగోలు చేయాలంటే ఆన్ లైన్లో చాలా సులభం. రెండు మూడు షాపులు తిరిగి ఒక్కో ప్రొడక్టును చూసి వస్తువును కొనుగోలు చేయాలంటే ఎంతో సమయం పడుతుంది. కానీ, ఆన్ లైన్లో ఒక్క క్లిక్ తో సొంతం చేసుకోవచ్చు. సులభ చెల్లింపులు: ఆన్ లైన్లో కొన్న వస్తువుకు సులభంగా డబ్బు చెల్లించేందుకు పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొంచెం ధర ఎక్కువగా ఉంటే ఈఎంఐ (ఈజీ మంథ్లీ ఇన్ స్టాల్ మెంట్)నీ ఎంచుకోవచ్చు. వస్తువును పొందాక ఇంటివద్దే డబ్బు చెల్లించే సదుపాయమూ అందుబాటులో ఉంది. అప్పటికప్పుడు ఎన్ఈఎఫ్టీ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్)ని ఉపయోగించుకుని డబ్బు కట్టేయొచ్చు కూడా. ఎన్నో చాయిస్ లు: ఎన్నో కంపెనీల ఉత్పాదనలు ఒకే చోట కళ్ల ముందు కదలాడతాయి. ఒకేసారి ఐదారు బ్రాండ్ల ఉత్పత్తులను పోల్చి చూసుకోవచ్చు. ఇదే ఆన్ లైన్ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్న అంశం. ఇక నష్టాల విషయానికి వస్తే... కేవలం చూసి మాత్రమే కొనుగోలు చేయాలి: ఒక వస్తువును తాకి, దాని పనితీరు స్వయంగా పరిశీలించి కొనాలంటే మాత్రం ఆన్ లైన్లో సాధ్యం కాదు. ఇది సంప్రదాయ విధానంలో... అంటే, ఓ స్టోర్ కు వెళితేనే సాధ్యపడుతుంది. ఒకవేళ ఆన్ లైన్లో కొన్న వస్తువులో తయారీపరంగా లోపాలు తలెత్తితే ఎన్నో తలనొప్పులు వస్తాయన్నది కస్టమర్ల అభిప్రాయం. అమ్మకానికి ఉంచినదే కొనాలి: మనకు అవసరం లేని వస్తువులు కూడా ఆన్ లైన్లో ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిని చూసి ముచ్చటపడి కొనుగోలు చేస్తున్న సందర్భాలూ లక్షలాదిగా వెలుగు చూస్తున్నాయి. అంటే, మనకు అవసరం లేని వస్తువులకు డబ్బు తగలేస్తున్నట్టేగా? బడ్జెట్ సమతుల్యం తప్పుతుంది: అమ్మకానికి ఉన్నాయి కదా అని ఆన్ లైన్లో కొనుగోలు చేస్తూ పోతే నెలవారీ బడ్జెట్లో సమతుల్యం తప్పుతుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు వాడి లావాదేవీలు జరిపేవారికి ఇది భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. వీటితో పాటు, తక్షణమే నచ్చిన ప్రొడక్టు చేతికి రాదు. ఓ వారం పది రోజుల (కొన్ని సంస్థలు మరుసటి రోజే డెలివరీ చేస్తున్నాయి) సమయం పడుతుండడం కాస్త అసంతృప్తిని కలిగించే విషయం. స్థానిక స్టోర్లతో పోలిస్తే వస్తువును రిటన్ ఇవ్వాలని భావిస్తే ఆన్ లైన్లో చాలా ఆలస్యం అవుతుంది. తక్కువ క్వాలిటీ ఉన్న ప్రొడక్టులు చేతికొచ్చే ప్రమాదం కూడా ఉంది. నెట్ లోపాల కారణంగా నగదు చెల్లింపుల్లో అవాంతరాలు ఏర్పడి, తిరిగి ఆ డబ్బు ఖాతాలోకి రావడానికి నెలల తరబడి సమయం పట్టవచ్చు. అధిక డిస్కౌంట్లతో అతి తక్కువ ధరలకు లభించే ఉత్పత్తుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికీ మించి కొనుగోలు చేసిన ప్రొడక్టులు కాకుండా, మామిడిపండ్లు, బండలు వంటివి ప్యాకింగ్ లో చేతికి వచ్చిన సందర్భాలూ కోకొల్లలు. కాబట్టి ఎంత సాంకేతికత అందివచ్చినా, ఆన్ లైన్ అమ్మకాలను బాలారిష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. కొనుగోలుదారులు స్వయంగా లాభనష్టాలను బేరీజు వేసుకుని మాత్రమే లావాదేవీలు జరపాలని సూచన.