: త్రివర్ణ పతాకాన్ని అవమానించారంటూ అమితాబ్, అభిషేక్ లపై కేసు
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ లపై ఘజియాబాద్ కోర్టులో కేసు నమోదైంది. జాతిని అవమానించే రీతిలో జాతీయ పతాకాన్ని వారి దేహాలకు కప్పుకున్నారన్న ఆరోపణతో చేతన్ ధిమాన్ అనే వ్యక్తి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ సమయంలో వారిద్దరూ జాతీయ జెండాను కప్పుకుని కనిపించారని పేర్కొన్నాడు. జాతీయ జెండాను అవమానించే రీతిలో అమితాబ్ వ్యవహరించడం సదరు ఫిర్యాదుదారుడు, అతని ఐదుగురు స్నేహితులు చూశారని వారి తరపు న్యాయవాది తెలిపాడు. అంతర్జాతీయంగా పేరున్న సినీ స్టార్, ఆయన కుమారుడు ఇటువంటి చర్యకు పాల్పడటం దేశ ఖ్యాతిని తగ్గించేందుకు పాల్పడినట్టేనని అన్నారు. ఈ చర్య 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971', 'ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002' కిందకు వస్తుందని, ఈ విషయంలో వారిద్దరికీ తప్పకుండా సమన్లు జారీ చేస్తారని, విచారణకు కోర్టు ఎదుట హాజరుకావల్సి ఉంటుందని తెలిపారు.