: రుతుపవనాలు, అల్పపీడన ప్రభావం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో విస్తృతంగా వానలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడి స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయంటున్నారు. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గుంటూరులో అత్యధికంగా 11.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీ రాజధాని అమరావతిలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. హైదరాబాద్, పశ్చిమగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.