: పండగలా సాగుతున్న ఏరువాక!
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందంగా ఏరువాక సాగుతున్నారు. ఇప్పటికే భూములు దుక్కి దున్ని, ఎరువులు, విత్తనాలను సమకూర్చుకున్న రైతులు నారు చల్లడం, విత్తులు వేయడంలో నిమగ్నమవుతున్నారు. వ్యవసాయ బోరు బావులు కలిగిన రైతులు మరింత ఆనందంగా ఉన్నారు. ఈ సీజనులో సకాలంలో, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగానే, ఖరీఫ్ ఆరంభంలోనే వర్షాలు కురుస్తుండడంతో రైతులు మరింత ఆనందంగా ఉన్నారు. గత సంవత్సరం సుమారు నెల రోజులు ఆలస్యంగా వర్షాలు కురియడంతో సాగు విస్తీర్ణంపై ఇది తీవ్రంగా ప్రభావం చూపింది. ఆలస్యంగా పంటలు వేసిన రైతులు చీడపీడల బెడదను ఎదుర్కోవాల్సి రాగా, ఆశించిన స్థాయిలో దిగుబడులు సైతం దక్కలేదు. ఈసారి మాత్రం మృగశిర కార్తె వచ్చిన వెంటనే వర్షాలు కురుస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఏరువాక పండగలా సాగుతోంది. కాగా, తెలంగాణ, ఏపీల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.