: ఇక సీఎం రమేశ్, గరికపాటిల వంతు... టీ ఏసీబీ నోటీసులు వారికేనంటూ ప్రచారం
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ నుంచి తదుపరి నోటీసులు అందుకునే టీడీపీ నేతలెవరనే అంశంపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు, నిన్న నరేందర్ రెడ్డిని ఆరు గంటల పాటు విచారించారు. రేపు సాయంత్రం 5 గంటల్లోగా విచారణకు హాజరుకావాలని సండ్రకు తాఖీదులు జారీ చేశారు. ఇక టీడీపీ సీనియర్ నేతలు, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ రావులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ.50 లక్షలు సీఎం రమేశ్ బ్యాంకు ఖాతా నుంచి విత్ డ్రా అయ్యాయని ఆరోపణలు వినిపిస్తుండగా, ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో గరికపాటి చర్చలు జరిపారన్న అంశంపై ఏసీబీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.