: సెల్ఫ్ డిఫెన్స్ లో కేసీఆర్ సర్కారు...తమ ‘డేటా’ను ఇవ్వరాదని టెలికాం సంస్థలకు ఆదేశాలు?
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎంతో పాటు ఆయన చుట్టూ ఉండే దాదాపు 120 మంది కీలక వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయంపై తమవద్ద పక్కా ఆధారాలున్నాయన్న ఏపీ సర్కారు వాదనే ఇందుకు కారణమని సమాచారం. నిన్నటి కేబినెట్ భేటీలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో కేసీఆర్ సర్కారు కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదివరకే చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని ఏపీ మంత్రులు ప్రకటించారు. దీంతో కాస్త అనుమానం కలిగిన కేసీఆర్ సర్కారు హోం శాఖ కార్యదర్శిని అప్రమత్తం చేసిందట. సర్కారు ఆదేశాలతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో ఆయన ప్రైవేట్ గా భేటీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భేటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంలోని ఏ ఒక్కరి కాల్ డేటాను ఎవరు కోరినా వెల్లడించరాదని ఆయన హుకుం జారీ చేశారట. అంతేకాక ఏపీ సర్కారుకు చెందిన కీలక వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయాలంటూ తాము రాసిన లేఖలను కూడా వెనక్కు ఇచ్చేయాలని ఆయన కోరారట. అయితే సదరు లేఖల అప్పగింతకు ఓ ప్రైవేట్ ఆపరేటర్ సరేనన్నా, కీలకమైన మరో ప్రైవేట్ ఆపరేటర్ ససేమిరా అన్నారట.