: అది అక్రమ నిర్మాణమేనట... వివాదంలో చంద్రబాబు బెజవాడ తాత్కాలిక నివాసం!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ప్రస్తుతం అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కారుపై పోరు సాగించేందుకే నిర్ణయించుకున్న చంద్రబాబు, అందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా బెజవాడలో ఆయన తాత్కాలిక నివాసం కోసం అధికారులు ఎంపిక చేసిన భవనంపై వివాదం రేకెత్తింది. కృష్ణా కరకట్టలపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నివాసాన్ని చంద్రబాబు తాత్కాలిక నివాసంగా అధికారులు ఎంపిక చేశారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా, ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వివరాల్లోకెళితే... ప్రకాశం బ్యారేజీకి 3.2 కిలో మీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ కు చెందిన ‘లింగమనేని ఎస్టేట్ అతిథి గృహం’ను చంద్రబాబు తాత్కాలిక నివాసానికి అనువైనదిగా అధికారులు గుర్తించారు. 1.32 ఎకరాల విస్తీర్ణంలో రెండంతస్తుల్లో నిర్మితమైన ఈ భవనంలో అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రాజధాని భూసేకరణ సమయంలో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన భవనంగా ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా కరకట్టలపై పర్యటించిన సందర్భంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా దీనిని అక్రమ నిర్మాణంగానే ప్రకటించారు. ఏపీ జలవనరుల శాఖ కూడా ఈ భవనాన్ని ఇదే కేటగిరీ కింద చేర్చింది. తాజాగా ఈ భవనాన్ని చంద్రబాబు తాత్కాలిక నివాసంగా అధికారులు ఎంపిక చేయడంతో, దీనిపై ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.