: చంద్రబాబు ఇంటి నిర్మాణానికి టీ సర్కారు నో...నెలన్నరగా సతాయిస్తున్న జీహెచ్ఎంసీ!


ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన ఇంటి నిర్మాణానికి అనుమతివ్వాలని నెలన్నర క్రితం ఆయన దరఖాస్తు చేసుకుంటే, ఇప్పటిదాకా అనుమతి రాలేదు. అంతేకాక సచివాలయంలో ఏపీ వాడుకుంటున్న భవనాలకు ఆస్తి పన్ను చెల్లిస్తేనే, ఆయన ఇంటి నిర్మాణానికి అనుమతిస్తామని గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మెలిక పెట్టిందట. ఈ మేరకు నిన్న జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో భాగంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు వెల్లడించారట. తన సొంత ఇంటిని ఆధునికీకరించుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు, ఇటీవలే సదరు ఇంటిని ఖాళీ చేసి అద్దె ఇంటిలోకి మారిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఇంటి నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తుకు నెలలోగా అనుమతి మంజూరు చేయాలని, అయితే నెలన్నరకు పైగా తన దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని జీహెచ్ఎంసీని నిలదీస్తే... ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము వ్యవహరిస్తున్నామని, ఈ విషయంలో తామేమీ చేయలేమని కూడా అధికారులు చెబుతున్నారట. ఈ విషయంపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సలహాదారుల వద్ద ప్రస్తావించినా, ఫలితం లేకపోయిందని చంద్రబాబు వాపోయారు. సీఎం హోదాలోని తానే ఇంతమేర ఇబ్బంది ఎదుర్కొంటుంటే, ఇక ఏపీకి చెందిన సామాన్యుల పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News