: ఆ వీడియో సృష్టించారు: సీసీఎస్ లో టీఆర్ఎస్ నేత విజయారెడ్డి ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నేత విజయారెడ్డిని నెట్టివేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయారెడ్డి స్పందించారు. తన ప్రతిష్ఠను, హోం మంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఎవరో ఆ వీడియోను సృష్టించారని ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆమె వివరణ ఇచ్చారు. జూన్ 8న పంజాగుట్టలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఆ సందర్భంగా తనకు, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి మధ్య వాగ్యుద్ధం జరిగిందన్నారు. అది తమ ప్రభుత్వ కార్యక్రమమైతే, బీజేపీ ఎమ్మెల్యే దాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేయడంతో భరించలేకపోయానని విజయ చెప్పారు. తనను సముదాయించేందుకు హోం మంత్రి ప్రయత్నించగా, తాను అభ్యంతరం వ్యక్తం చేశానని తెలిపారు. రామచంద్రారెడ్డి తనను వేదిక దిగి వెళ్లిపోవాలన్నారని, తాను ఆగ్రహం వ్యక్తం చేశానని వివరించారు. ఓ పార్టీ ఫేస్ బుక్ పేజీ నిర్వాహకులు, ఓ ప్రాంతీయ టీవీ చానల్ వీడియోను అప్ లోడ్ చేశాయని ఆరోపించారు. విజయారెడ్డి ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు సీసీఎస్ అధికారులు తెలిపారు.