: ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఆరు చార్జ్ షీట్లు... ఆప్ ఎమ్మెల్యేలపై 24 కేసులు
ఢిల్లీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలపై 24 కేసులు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు కాగా, వాటిల్లో భాగంగా రెండు కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని వివరించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఒక చార్జ్ షీటు దాఖలైంది. ఈ కేసుల విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేయనున్నామని వివరించారు. కేజ్రీవాల్ పై నిషేధం అమల్లో ఉండగా, ప్రదర్శనలు, నిరసనలు చేపట్టడం, ప్రభుత్వాధికారుల విధులకు అడ్డుపడడం వంటి కేసులున్నాయి. ఇక మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ పై ఇటీవలే మోసం / ఫోర్జరీ కేసులు దాఖలు కాగా, భార్యను మానసికంగా వేధించిన కేసులో సోమనాథ్ భారతి చిక్కుల్లో పడ్డారు. కరోల్బాగ్ ఎమ్మెల్యే విశేష్ రవిపై నమోదైన ఓ కేసులో ప్రాథమిక దర్యాప్తు జరుగుతుండగా, మనోజ్ కుమార్ అనే ఎమ్మెల్యేపై మోసం, ఫోర్జరీ కేసులతో పాటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు కూడా ఉంది. నరేష్ బలియాన్ అనే మరో ఎమ్మెల్యేపై ఎన్నికల సమయంలో మద్యం పంచుతూ పట్టుబడ్డ కేసు, జర్నైల్ సింగ్ ప్రభుత్వోద్యోగిని కొట్టిన కేసు విచారణలో ఉన్నాయి.