: చెన్నైలో 'మెట్రో' రాడ్ మీద పడి టెక్కీ మృతి
చెన్నై మెట్రో నిర్మాణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం రోడ్డులో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్ వద్ద ఇనుప రాడ్ పై నుంచి పడి ఓ ఐటీ ఉద్యోగి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన నేటి ఉదయం జరిగింది. మాదిపక్కం ప్రాంతానికి చెందిన గిరిధర్ (30), స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరే తన బైకుపై ఆఫీసుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మెట్రో స్టేషన్ నుంచి పది అడుగుల పొడవైన ఇనుప రాడ్ ప్రమాదవశాత్తూ, పై నుంచి జారి, కింద వెళుతున్న గిరిధర్ తలపై పడింది. రాడ్ బలంగా తాకడంతో గిరిధర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, చెన్నైలో మెట్రో పనులు మొదలైన తరువాత ఇటువంటి ప్రమాదాలలో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది.