: సంచలనం... హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి రూ. కోటి నకిలీ కరెన్సీ స్వాధీనం
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు చెందిన ఓ శాఖలో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ వెలుగుచూడడం సంచలనం కలిగించింది. గుర్గావ్ పరిధిలోని సెక్టార్ 53లో బ్యాంకు నిర్వహిస్తున్న శాఖలో మొత్తం కోటీ నాలుగు లక్షల రూపాయల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో గుర్తు తెలియని వ్యక్తులపై సుశాంత్ లోక్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ డబ్బును ఎవరు జమ చేశారన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరింతగా నకిలీ డబ్బు జమ చేసి వుండవచ్చని, అది డబ్బు విత్ డ్రా చేసుకున్న ఖాతాదారులకూ వెళ్లి వుండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో బ్యాంకు ఖాతాదారులు, ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ శాఖ నుంచి డబ్బు డ్రా చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు.