: ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరిన వేం నరేందర్ రెడ్డి... మరికాసేట్లో విచారణ ప్రారంభం
ఓటుకు నోటు కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ నేత, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. అంతకుముందు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుతో వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఏసీబీ విచారణలో భాగంగా ఎలా స్పందించాలనే దానిపై ఆయన ఎర్రబెల్లితో సమాలోచనలు చేశారు. నిన్న రాత్రి ఏసీబీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న ఆయన ఉదయాన్నే విచారణకు వస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఏసీబీ కార్యాలయానికి వేం నరేందర్ రెడ్డి చేరుకోగానే ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణాధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు.