: కేసీఆర్ తో భేటీ అయిన డీజీపీ, ఏసీబీ డీజీ... ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ లు భేటీ అయ్యారు. నిన్న రాత్రి టీటీడీపీ నేతలు వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల నివాసాలకు వెళ్లిన ఏసీబీ విచారణ జరిపే ప్రయత్నం చేసింది. కాగా, తన ఆరోగ్యం బాగాలేదని, రేపు ఉదయం విచారణకు వస్తానని ఏసీబీ అధికారులకు వేం నరేందర్ రెడ్డి చెప్పారు. సండ్ర వెంకటవీరయ్య మాత్రం ఏసీబీ అధికారులు వచ్చిన సమయంలో తన నివాసంలో లేరు. ఈ క్రమంలో, ఈ రోజు ఎలాంటి చర్యలను తీసుకోబోతున్నారో ముఖ్యమంత్రికి డీజీపీ, ఏసీబీ డీజీ వివరించినట్టు సమాచారం. మరోవైపు, 24 గంటల్లో సంచలనం జరగబోతోందంటూ టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కూడా దూకుడు పెంచితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించినట్టు సమాచారం.