: తెలంగాణకు అండగా వేలమంది స్టీఫెన్ సన్ లున్నారు.. జాగ్రత్త: స్టీఫెన్ సన్ సంచలన వ్యాఖ్య
ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తి, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణకు అన్యాయం చేయాలని ఎవరు చూసినా, వారిని అడ్డుకునేందుకు వేల సంఖ్యలో స్టీఫెన్ సన్ లు ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి’’ అని ఆయన ప్రకటించారు. ఓటుకు నోటు కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని పక్కా సాక్ష్యాధారాలతో పట్టించిన స్టీఫెన్ సన్ ను నిన్న నగరంలోని క్రిస్టియన్ సంఘాలన్నీ కలిసి సికింద్రాబాదు పరిధిలోని సెయింట్ మేరీస్ కళాశాలలో ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భగా స్టీఫెన్ సన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎవరి ప్రలోభాలకు తలొగ్గలేదు. నన్ను ఎవరూ ప్రభావితం చేయలేరు. నేను ఏమి చేసినా ఆత్మసాక్షిగానే చేశా. ఈ ఒక్క జీవితం పోతే పోయింది. కానీ నా ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను’’ అని ఆయన ప్రకటించారు.