: ఏపీ, టీఎస్ పోలీసుల మధ్య గొడవపెట్టాలని చూస్తున్నారు: అంబటి రాంబాబు


ఓటుకు నోటు వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు హఠాత్తుగా సెక్షన్-8 గుర్తొచ్చిందని, ఏడాదిగా లేనిది ఇప్పుడు హైదరాబాదులో ఏపీ పోలీసులను మోహరించడం ఏమిటని నిలదీశారు. ఇది, ఏపీ, టీఎస్ పోలీసుల మధ్య గొడవపెట్టడమేనని అన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో నోటీసులు స్వీకరించి విచారణకు సహకరించాలని అంబటి సూచించారు. ఈ కేసు విషయంలో టీడీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు తమ వద్ద ఉన్న ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలోకి తమ పార్టీ అధినేత జగన్ ను అనవసరంగా లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరును వైఎస్సార్సీపీ ఖండిస్తోందని, ఈ విషయంలో టీడీపీతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాంటి తమపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. తమపై బురద చల్లి లబ్ధి పొందాలని చూస్తే అనర్థాలకు కారణమవుతారని హెచ్చరించారు. చంద్రబాబు ఓ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పదేపదే తప్పులు చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News