: మీడియాలో కోడై కూస్తున్నవారు అప్పుడేం చేస్తారు?: సీఎం రమేశ్
టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటు ఓ ఎంపీకి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయనుందని, ఆ ఎంపీ సీఎం రమేశ్ అని మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. దీనిపై రమేశ్ ఫోన్ లో ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. తమ పాత్రపై ఆధారాలుంటే చర్యలు తీసుకోవచ్చని, తాము స్వాగతిస్తామని అన్నారు. టీఆర్ఎస్ సర్కారుతో జగన్ కుమ్మక్కై మైండ్ గేమ్ ఆడుతున్నారని, అందుకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. జగన్ చెప్పిందే సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు రాస్తున్నాయని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన అకౌంట్ నుంచే డబ్బును డ్రా చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఆయన బదులిచ్చారు. బ్యాంకు నుంచి డ్రా చేశారంటున్నారు కాబట్టి, అందుకు రసీదులుంటాయని, డ్రా చేశారా? లేదా? అన్న విషయం బ్యాంకు అధికారులను అడిగితే తేలిపోతుందని అన్నారు. రేవంత్ రెడ్డికి తాను డబ్బు ఇవ్వలేదని తేలితే మీడియాలో కోడై కూస్తున్నవారు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.