: చంద్రబాబుకు నోటీసులిచ్చే అధికారం ఏసీబీకి లేదు: అచ్చెన్నాయుడు
ఓటుకు నోటు వ్యవహారం కీలక దశకు చేరుకున్నట్టు అర్థమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చే అధికారం ఏసీబీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తొలుత రేవంత్ ను అరెస్టు చేసిందని, ఆపై చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. గత పదిహేను రోజులుగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఓ పత్రిక ఏం రాస్తే కేసీఆర్ సర్కారు తు.చ. తప్పకుండా అదే చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలో తమకు సర్వహక్కులు ఉన్నాయని అన్నారు. ఉమ్మడి రాజధానిలో తెలుగుదేశం పార్టీ నేతల భద్రతను తామే స్వయంగా చూసుకుంటామని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి వేధించాలన్న భ్రమలో కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు.