: కేసీఆర్ పై 'ఏ-4' మత్తయ్య చేసిన ఫిర్యాదును సీఐడీకి అప్పగించిన ఏపీ పోలీసులు... పూర్తి స్థాయి విచారణకు ఆదేశం
ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విజయవాడలోని సత్యనారాయణపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు చెప్పాలని తనను టి.ఏసీబీ అధికారులు బెదిరించారని మత్తయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి తెలంగాణ పోలీసులు, టీఆర్ఎస్ నేతలతో ప్రాణహాని ఉందని తెలిపారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టి.పోలీసులు తనకు ఆపద తలపెట్టవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదును ఏపీ పోలీసులు సీఐడీకి అప్పగించారు. ఫిర్యాదులో అనేక కోణాలు ఉన్నందున సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.